విజయవాడ (వి.వి.) :తూర్పు గోదావరి జిల్లాలో మహనీయుడు, జాతి గర్వించదగ్గ మేధావి డా|| బి.ఆర్. అంబేద్కర్ విగ్రహాలు కూల్చడం దారుణమని, ఈ ఘటనకు సంబంధించి కీలక ఆధారాలు లభ్యమయ్యాయని, విగ్రహాలు కూల్చే అసాంఘిక శక్తులను ఒక్క రోజు లోపే పట్టుకుతీరుతామని రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ దినేష్‌రెడ్డి స్పష్టం చేశారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో పోలీస్ పికెటింగ్ ముమ్మరం చేశామని, కోస్టల్ ఐజి అక్కడి పరిస్థితులను చక్కదిద్దుతున్నారని చెప్పారు. శుక్రవారం విజయవాడలో సబ్ కంట్రోల్ రూమ్స్ ప్రారంభించడానికి విచ్చేసిన ఆయన కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ విజయవాడ కమిషనరేట్, కృష్ణా, పశ్చిమగోదావరి పరిధిలో 16 కొత్త పోలీస్ స్టేషన్లు, 24 సబ్ కంట్రోల్ కార్యాలయాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఎన్‌హెచ్-5, ఎన్‌హెచ్-9లో పోలీస్ పెట్రోలింగ్ ముమ్మరం చేస్తున్నామని, వీటి ద్వారా జాతీయ రహదారులపై ఎదురయ్యే సమస్యలు కూడా పరిష్కరిస్తారన్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో సెంట్రల్ క్రైమ్ స్టేషన్స్‌కి అదనపు అధికారాలు ఇస్తున్నామన్నారు. విజయవాడలో సైబర్ క్రైమ్ స్టేషన్‌ను ఏర్పాటుచేసి దాన్ని సి.ఐ.డి.కి అప్పగిస్తామన్నారు. యానంలో ఏర్పడిన సమస్యను పాండిచ్చేరి పోలీసులే పరిష్కరిస్తారని, మన పోలీస్ బృందాల పని నామమాత్రమేనని ఒక ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. సూరి హత్య కేసు విషయమై ప్రశ్నించగా, భాను బతికే వున్నాడని, కేసు విచారణ పూర్తయ్యాక తప్పక బయటపెడతామన్నారు. హోంగార్డుల సమస్యలు పరిష్కారం దిశగా వున్నాయని, దీని కోసం వేసిన కమిటీ నివేదిక ఆధారంగా అలవెన్సులు పెంపుదల, బస్‌పాస్, ఆరోగ్యశ్రీ తదితర పథకాలు వారికి వర్తించే విధంగా ముఖ్యమంత్రి చర్యలు తీసుకుంటున్నారన్నారు. రాష్ట్రంలో వున్న 1.4 లక్షల మంది పోలీసుల సంక్షేమానికి ప్రతి సంవత్సరం కోటి రూపాయలు కేటాయిస్తున్నారని తెలిపారు. నక్సల్స్ విషయమై ప్రశ్నించగా, రాష్ట్ర సరిహద్దులో వారి ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారని, మన పోలీస్ వారికి ధీటైన సమాధానం ఇస్తున్నారని చెప్పారు. ఉభయ గోదావరి, కృష్ణాజిల్లా పరిధిలో పోలీస్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు కోసం ఆగిరిపల్లి వద్ద 70 ఎకరాలు కేటాయించడం జరిగిందన్నారు. పోలీస్‌ల ప్రమోషన్ల గురించి మాట్లాడుతూ 64 మంది డి.ఎస్.పి.లను అడిషనల్ ఎస్.పి.లుగా ప్రమోషన్ ఇచ్చారని, 26 మందికి ఐపిఎస్ హోదా కల్పించారని చెప్పారు. జిల్లాకి మూడు డిఎస్‌పి పోస్టులు డైరెక్ట్ రిక్రూట్ చేయడానికి నిర్ణయించారన్నారు. విజయవాడ పోలీస్ పనితీరు బాగుందన్నారు. బాధితులు ఎవరైనా పోలీస్ స్టేషన్‌కు వచ్చి, తమ సమస్యలు చెప్పుకుని, పోలీసులపై నమ్మకంతో సంతోషంగా తిరిగి వెళ్ళే వాతావరణాన్ని పోలీస్ స్టేషన్‌లలో కల్పిస్తున్నామన్నారు. ఈ సమావేశంలో నగర పోలీస్ కమిషన్ ఎన్. మధుసూదనరెడ్డి కూడా పాల్గొన్నారు.
ఆర్ ఎస్ ఎస్ ఫీడ్స్
ట్విటర్ లో ఫాలో అవ్వండి
