భారతీయుల దాస్యవిముక్తికి నాంది

Thu, 26 Jul 2012, IST    vv

సుమారు రెండు శతాబ్దాలు మన దేశాన్ని తమ గుప్పెట్లో పెట్టుకుని పరిపాలించిన బ్రిటిష్‌ వారిపై యుద్ధాన్ని ప్రకటించిన తొలి స్వాతంత్య్ర సమర యోధుడు మంగళ్‌ పాండే. అప్పటి వరకూ బ్రిటిష్‌ వారి పెత్తనానికి తలవొగ్గి వాళ్ళు చేస్తున్న అరాచకాలు, అవమానాలు మౌనంగా భరించిన భారతీయుల ఆలోచనలను స్వేచ్ఛా స్వాతంత్య్రాల సాధన వైపు మళ్లించిన ఘనత మంగళ్‌ పాండేదే!ఉత్తరప్రదేశ్‌లో పుట్టిన మంగళ్‌ పాండే తన 22వ యేట బెంగాల్‌ ప్రాంత బ్రిటిష్‌ సైన్యంలో చేరాడు. అక్కడ బ్రిటిష్‌ అధికారుల ప్రవర్తన, వారు చేసే అవమానాలు అతన్ని ఆలోచింపజేశాయి. అప్పట్లో ఆ సైన్యంలో నూటికి తొంభైమంది భారతీయులే వుండేవారు. అందులోనూ హిందువులు, ముస్లిములూ ఇప్ప టిలాగా అప్పట్లో హిందూ ముస్లిం బేధభావాలు లేవు. హిందువులు, ముస్లింలు భారతీ యులు.. అంతే! అందరూ కలసి మెలసి వుండేవారు.

మంగళ్‌ పాండే పనిచేస్తున్న 34వ బెంగాల్‌ బెటాలియన్‌కు కమాండర్‌గా పనిచేస్తున్న బ్రిటిష్‌ అధికారి క్రిస్టియన్‌ మత బోధకుడు కూడా! అధికారులు సిపాయిలకు వాడే రైఫిల్‌లో వుపయోగించడానికి గొట్టం లాంటివి ఇచ్చేవారు. దాని మూతను సిపాయిలు నోటితో కొరికి తీసి రైఫిల్‌లో పెట్టాల్సి వచ్చేది. అది కొరికేటపుడు ఆ సిపాయిల్లో అనుమానం తలెత్తింది. నెమ్మదిగా ఆ అనుమానం బలపడింది. ఇంతకీ ఆ అనుమానం...ఆ తూటాల గొట్టాలను ఆవు తోలుతో చేయిస్తున్నారని, దానిపైన పందికొవ్వు పూస్తున్నారని ఆవు హిందువులకు పరమ పవిత్రమైనది, పూజనీయమైనది. ఆవు తోలును నోటితో కొరకాల్సి రావడం ఆ సైన్యంలోని హిందువులను బాధించింది. అలాగే పంది అంటే ముస్లింలకు ఏహ్యభావం, అందుకని వారికి ఆ తూటాలను నోటిలో పెట్టుకోవాల్సి రావడం ఇబ్బంది కలిగించింది. మొత్తానికి సిపాయిలందరూ ఈ విషయంలో చాలా అసహనంగా వున్నారు. తమ కమాండర్‌ భారతీయులను అవమానించడానికి కావాలనే ఈ ఏర్పాటు చేశాడనే నిశ్చయానికి వచ్చారు.

కలకత్తా దగ్గరలోని బారక్‌పూర్‌లో 1857 మార్చ్‌ 29న మంగళ్‌పాండే సార్జెంట్‌పైన, అతని సహాయకుడి పైన దాడి చేసి గాయపరిచాడు. తోటి సైనికులు అడ్డుకోకపోతే ఇద్దర్నీ హతమార్చేవాడే! దాంతో బ్రిటిష్‌ ప్రభుత్వం అతన్ని అరెస్ట్‌ చేసింది. మరణశిక్ష విధించింది. తెల్లవారి చేతుల్లో చావడం ఇష్టం లేని మంగళ్‌ పాండే ఆత్మహత్యా ప్రయత్నం చేశాడు. కానీ విఫలం అయింది. చివరకు మంగళ్‌ పాండేని ఉరి తీశారు.భారతీయుల దాస్య విముక్తికి నాంది పలికిన పోరాటంగా, ముఖ్యంగా సిపాయిల తిరుగుబాటుగా పిలిచే మంగళ్‌ పాండే చేసిన ఆ పోరాటం ప్రథమ భారత స్వాతంత్య్ర పోరా టానికి ప్రారంభంగా చరిత్రలో నిలిచిపోయింది. ఆ తర్వాత ఎందరో త్యాగధ నులు తమ ధన, మాన, ప్రాణాలను తృణ ప్రాయంగా భావించి సుమారు తొమ్మిది దశా బ్దాలు చేసిన పోరాట ఫలితమే నేటి స్వేచ్ఛా భారతం.


Share Email Print

జిల్లా వార్తలు

సైద్దాంతిక మాస పత్రిక

ఇతర సంచికలు